ఒప్పందాలు కార్యరూపం..ప్రతిపాదనల దశ దాటి నిర్మాణాల్లోకి 16 దిగ్గజ కంపెనీలు

ఒప్పందాలు కార్యరూపం..ప్రతిపాదనల దశ దాటి నిర్మాణాల్లోకి 16 దిగ్గజ కంపెనీలు
  • అమెజాన్ డేటా సెంటర్, ఆర్అండ్ డీ లాంటి ప్లాంట్ల పనులు షురూ
  • రూ.73,124 కోట్ల పెట్టుబడుల పనులు స్పీడప్ 
  •  ప్రత్యక్షంగా 14,596 మందికి ఉపాధి అవకాశాలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకున్న ఒప్పందాలు క్షేత్రస్థాయిలో వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయి. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు రూ.73,124 కోట్ల భారీ పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు గ్రౌండింగ్(నిర్మాణ పనులు) స్పీడందుకన్నాయని అధికారులు చెప్తున్నారు. ల్యాండ్​కేటాయింపులు పూర్తవడంతో డేటా సెంటర్లు, ఫార్మా, ఏరోస్పేస్ తదితర వైవిధ్యమైన రంగాలకు చెందిన 16 దిగ్గజ సంస్థలు తమ పనులను వేగవంతం చేసినట్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు వచ్చే 7–8 నెలల్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా 14,596 మంది నిరుద్యోగులకు, పరోక్షంగా అంతకు మూడింతలు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాది కాలంలో రూ.200 కోట్లకు పైబడిన ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. మీర్‌‌ఖాన్‌‌పేట్, మహేశ్వరం, ఫ్యాబ్ సిటీ, మామిడిపల్లి లాంటి కీలక పారిశ్రామిక వాడలు ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణం కారణంగానే సంస్థలు ఒప్పందాలు చేసుకున్న వెంటనే తమ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.

డేటా సెంటర్లదే అగ్రస్థానం

తాజాగా గ్రౌండింగ్ అయిన ప్రాజెక్టుల్లో అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందువరుసలో ఉన్నది. మీర్‌‌ఖాన్‌‌పేట్, ఐపీ-పెద్దవీడు ప్రాంతాల్లో రెండు వేర్వేరు డేటా సెంటర్ల కోసం ఏకంగా రూ.59,231 కోట్లతో పనులు చేపడుతోంది. వీటి ద్వారా 166 మందికి  ఉపాధి దక్కనుంది. ఇదే బాటలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ సంస్థ రూ.2,700 కోట్లతో మీర్‌‌ఖాన్‌‌పేట్‌‌లో తమ కేంద్రాన్ని నిర్మిస్తుండగా, 1,033 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

అలాగే ఐపీ-చందన్‌‌వెల్లిలో ఇన్ఫిస్పియర్ నెట్‌‌వర్క్స్ సంస్థ రూ.1000 కోట్లతో మరో డేటా సెంటర్ నిర్మిస్తోంది. మామిడిపల్లిలోని సైన్స్ అండ్ టెక్ పార్క్‌‌లో క్రామ్సన్ రీసెర్చ్ పార్క్ రూ.1,890 కోట్లతో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా 2,500 మందికి పరిశోధనా రంగంలో ఉపాధి లభించనుంది. 

ఉత్పాదక, రక్షణ రంగాల్లోనూ..

ఉత్పాదక, ఎనర్జీ, రక్షణ రంగాల్లోనూ పరిశ్రమల స్థాపన పనులు వేగవంతమయ్యాయి. ఐపీ-సీ తారాంపూర్‌‌లో హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ రూ.1682 కోట్లతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతుండగా, ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్‌‌కార్ట్ మామిడిపల్లిలో రూ.1500 కోట్లతో భారీ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది.

పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తూ ప్రీమియర్ ఎనార్జీస్ గ్లోబల్ సంస్థ సీతారాంపూర్, ఫ్యాబ్ సిటీల్లో రూ.1,653 కోట్లు వెచ్చించి సోలార్ సెల్ తయారీ యూనిట్ల పనులను ప్రారంభించింది. రక్షణ రంగానికి సంబంధించి ఈఎంసీ-మహేశ్వరంలో జేఎస్‌‌డబ్ల్యూ యూఏవీ సంస్థ రూ.787 కోట్లతో మానవరహిత వైమానిక వ్యవస్థల (వీ-బ్యాట్ డ్రోన్స్) తయారీ పనులకు శ్రీకారం చుట్టింది. మామిడిపల్లిలో ఐటీపీ ఎక్స్‌‌టర్నల్స్ ఇండియా సంస్థ విమాన ఇంజిన్ విడి భాగాల తయారీ కోసం రూ.403 కోట్లతో ప్లాంట్‌‌ను సిద్ధం చేస్తోంది.

ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఫార్మా, ఎలక్ట్రానిక్స్

ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కుదిరిన ఒప్పందాలు కూడా గ్రౌండింగ్ పూర్తి చేసుకుని, ఉత్పత్తి దశకు చేరుకుంటున్నాయి. కోట్యాల్ బయోటెక్ పార్క్‌‌లో వివింట్ ఫార్మా రూ.519 కోట్లతో క్రిటికల్ కేర్ ఫార్ములేషన్స్ యూనిట్‌‌ను, వాక్సిండో సంస్థ రూ.300 కోట్లతో పౌల్ట్రీ వ్యాక్సిన్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్ మహేశ్వరంలో రూ.437 కోట్లతో ఇయర్‌‌ఫోన్ల తయారీ ప్లాంట్‌‌ను గ్రౌండింగ్ చేసి 2,000 మందికి ఉపాధి చూపుతోంది.

యూడీఎల్-ఉట్టర్‌‌పల్లిలో కేజేఎస్ ఇండియా సంస్థ రూ.647 కోట్లతో నెస్లే ఉత్పత్తుల(జాబ్ వర్క్స్) తయారీ యూనిట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇక ఫ్యాబ్ సిటీలో ప్రముఖ సంస్థ క్రాంప్టన్ గ్రీవ్స్ కేవలం రూ.375 కోట్లతో ఫ్యాన్ల తయారీ కేంద్రాన్ని స్థాపిస్తూ అత్యధికంగా 3,500 మందికి ఉపాధి కల్పించే దిశగా పనులు పూర్తి చేస్తోంది. మొత్తంగా చూస్తే ఎంవోయూల దశ నుంచి గ్రౌండింగ్ దశకు పరిశ్రమలు వేగంగా మారుతుండటం రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి సానుకూల పరిణామమని నిపుణులు చెబుతున్నారు.